: 2,500 రూపాయలతో 12 ఏళ్ల క్రితం ముంబై వచ్చాను... అదే మొత్తంతో ఇప్పుడు వెళ్లిపోగలను!: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్
బాలీవుడ్ లో ప్రతిభావంతుడైన నటుడిగా పేరుతో పాటు ఆఫర్లు, స్టార్ డమ్ సంపాదించుకున్న నవాజుద్దీన్ సిద్దిఖీ నేటికీ తానేమీ మారలేదని చెబుతున్నాడు. కీలక పాత్రలు పోషించే నటుడిగా పేరుతెచ్చుకున్న నవాజుద్దీన్ సిద్దిఖీ సినిమాలపై ప్రేమతో 12 ఏళ్ల క్రితం 2,500 రూపాయలతో ముంబై చేరానని చెబుతున్నారు. తొలి మూడేళ్లు చాలా దారుణంగా గడిచాయని చెప్పాడు. చేసేందుకు పని లేదని అన్నాడు. అవకాశాలు వచ్చేవి కాదని చెప్పాడు. దీంతో మధ్యాహ్న భోజనం ఒక స్నేహితుడి ఇంట్లో, రాత్రి భోజనం మరో స్నేహితుడి ఇంట్లో చేసేవాడినని, సిగిరెట్ ఇంకో స్నేహితుడు కొనిచ్చేవాడని అన్నాడు.
ఒక దశలో ముంబై వదిలి వెళ్లిపోవాలని అనుకున్నానని, తరువాత ఆలోచించి మనసు మార్చుకుని సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నించే వాడినని చెప్పాడు. 'సర్ఫ్ రోష్'లో చిన్న పాత్రతో తన సినీ రంగప్రవేశం జరిగిందని చెప్పాడు. స్టార్ డమ్ వచ్చిందని, మంచి రెమ్యూనరేషన్ ఇస్తున్నారని, అయినా తన లైఫ్ స్టైల్ ఏమాత్రం మారలేదని అన్నాడు. తాను అప్పట్లో తెచ్చుకున్న 2,500 రూపాయలతో ఈ క్షణం వెళ్లిపోవాల్సి వచ్చినా ఎలాంటి బాధ ఉండదని, వెళ్లిపోగలనని నవాజుద్దీన్ సిద్దిఖీ తెలిపాడు. నవాజుద్దీన్ కు నిరాడంబరంగా ఉంటాడని బాలీవుడ్ లో పేరుంది.