: 'అకున్ సబర్వాల్ నుంచే సమాచారం వస్తోందేమో?' అన్న ప్రశ్నకు... 'మీరలా వస్తే నేనేం అంటాను?' అన్న సినీ నటుడు శివాజీ రాజా!
ఏబీఎన్ న్యూస్ చానల్ నిర్వహించే 'ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ' కార్యక్రమంలో భాగంగా నటుడు, మా అధ్యక్షుడు శివాజీ రాజాను చానల్ ఎండీ రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేసిన వేళ, ఆసక్తికర సమాధానాలు వచ్చాయి. పూరీ జగన్నాథ్ డ్రగ్స్ తీసుకున్నారా? లేదా? అన్న విషయం ఫోరెన్సిక్ పరీక్షల తరువాత వెలుగులోకి వస్తుందని, ఈ లోగానే మీడియా అత్యుత్సాహాన్ని ఎందుకు చూపుతోందని ప్రశ్నించిన శివాజీ రాజా, ప్రతి ఒక్కరూ అకున్ సబర్వాల్ మాదిరిగా ఐపీఎస్ ఆఫీసర్లు అయిపోతున్నారని, అధికారులు మీడియాకు లీకులిస్తుంటే, వాటిని చూపేందుకు అమితాసక్తిని చూపుతోందని అన్నాడు.
ఆ సమయంలో కల్పించుకున్న రాధాకృష్ణ, "ఏమో... అకున్ సబర్వాల్ దగ్గరి నుంచే వచ్చిందేమో ఇన్ఫర్మేషన్" అనగా, "మీరలా వచ్చారా? నేనేమంటానిక" అని నవ్వేసి ఊరుకున్నాడు శివాజీ రాజా. ఏ చిన్న అన్యాయాన్ని చూసినా తనకు కోపం తన్నుకు వస్తుందని, ఇండస్ట్రీలో కొంత మందిని చూస్తే, తనకు అసహ్యం వేస్తుందని కూడా ఆయన అన్నారు. తాను ఎన్ని రాంగ్ స్టెప్పులు వేయాలో అన్నీ వేసేశానని, ఇంట్లో దొంగతనాలు, ఎవరు బాగా చదువుతుంటే వారి పుస్తకాలు దొబ్బేసి అమ్మేయడం వంటి పనులు చేశానని చెప్పాడు. నాకన్నా మోహన్ బాబుకు కోపం ఎక్కువ కాబట్టే ఆయనతో గొడవలు వచ్చాయని వెల్లడించాడు. బ్రహ్మానందంతో కూడా గొడవలు వచ్చాయని చెప్పాడు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా ఉందని అన్నాడు. ఈ రోజు రాత్రి 8.30 గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ప్రోమోను ఏబీఎన్ ప్రముఖంగా చూపుతోంది.