: డ్రగ్స్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన టాలీవుడ్ బడా నిర్మాత... ఉచ్చు బిగిస్తున్న సిట్
నటించింది మూడు, నాలుగు చిత్రాల్లోనే అయినా, యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న యువహీరో తండ్రి, టాలీవుడ్ లో బడా నిర్మాతగా పేరున్న ఓ వ్యక్తి పేరు తాజాగా సిట్ విచారణలో వెలుగులోకి వచ్చింది. అయితే, ఆయన పేరు డ్రగ్స్ వాడకందారుల జాబితాలో కాదు. డ్రగ్స్ సరఫరాలో ఆయన పేరు వినిపిస్తోంది. జీషాన్, కెల్విన్ తదితరులకు డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు ఆయన స్వయంగా పెట్టుబడులు సమకూర్చినట్టు ఉప్పందుకున్న సిట్ పోలీసులు, మరిన్ని సాక్ష్యాల అన్వేషణలో నిమగ్నమయ్యారు. ఈ కేసులో కస్టమర్లను అరెస్ట్ చేయబోమని, వారికి కౌన్సెలింగ్ ఇప్పించి, డ్రగ్స్ వాడకానికి దూరం చేస్తామని ముందే చెప్పిన అధికారులు, డ్రగ్స్ ను ఇతరులకు ఇచ్చిన వారిని, ఈ వ్యాపారాన్ని సాగిస్తున్న వారినీ వదిలి పెట్టబోమని హెచ్చరిస్తున్నారు. ఈ నిర్మాత సినీ రంగంతో పాటు ఇతర వ్యాపారాల్లోనూ ఉన్నాడని, అతనికి కూడా వచ్చే వారంలో నోటీసులు అందించే అవకాశాలు ఉన్నట్టు సిట్ అధికారులు వెల్లడించారు.