: ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ తర్వాత ఉగ్రవాదుల లక్ష్యదేశం ఇండియానే.. ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రసంస్థల జాబితాలో నక్సలిజం.. అమెరికా నివేదికలో వెల్లడి!
ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్‌ల తర్వాత ఉగ్రవాదులు విరుచుకుపడే దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. గతంలో ఈ స్థానంలో దాయాది పాకిస్థాన్ ఉండేది. ఈ మేరకు అమెరికాకు చెందిన ‘నేషనల్ కన్సార్టియం ఫర్ ది స్టడీ ఆఫ్ టెర్రరిజం అండ్ రెస్సాన్సెస్ టు టెర్రరిజం’ నివేదిక వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా 2016లో మొత్తం 11,072 ఉగ్రదాడులు జరిగాయి. ఇందులో 927 అంటే 16 శాతం భారత్‌లోనే జరిగాయి. 2015లో 798 జరిగాయి. అలాగే దాడుల వల్ల మరణాలు కూడా పెరిగాయి. 2015లో 289 మంది మృత్యువాత పడగా గతేడాది వాటి సంఖ్య 337 మంది అంటే 17 శాతానికి పెరిగింది. గాయపడిన వారి సంఖ్య కూడా 2015తో పోలిస్తే పెరిగింది. ఆ ఏడాది 500 మంది క్షతగాత్రులు కాగా, గతేడాది 636 మంది గాయపడ్డారు. అదే సమయంలో పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు గణనీయంగా తగ్గాయి. 2015లో ఆ దేశంలో 1,010 దాడులు జరగ్గా 2016లో 734కు తగ్గాయి.
అమెరికా నివేదిక వెల్లడించిన విషయాల్లో మరో అత్యంత ఆశ్చర్యపరిచే విషయం నక్సలిజం. ప్రపంచాన్నివణికిస్తున్న ఉగ్రసంస్థల్లో నక్సలిజాన్ని కూడా చేర్చింది. ఇస్లామిక్ స్టేట్, తాలిబన్ల తర్వాత నక్సల్సే అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. ఆ తర్వాత బొకొహరమ్ అని తేల్చి చెప్పింది. గతేడాది జరిగిన 336 ఉగ్రదాడుల్లో సీపీఐ (మావోయిస్ట్) హస్తం ఉందని తెలిపింది. ఈ దాడుల్లో 174 మంది మృతి చెందారని, 141 మంది గాయపడ్డారని పేర్కొంది. ఇక 2016లో దేశంలో జరిగిన దాడుల్లో సగం జమ్ముకశ్మీర్, చత్తీస్‌గఢ్, మణిపూర్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోనే జరిగినట్టు అమెరికా నివేదిక వివరించింది.