: ఛార్మి ఎంట్రీతో డ్రగ్స్ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో?
హైదరాబాదులో డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు సినీ పరిశ్రమలోని ప్రముఖులను చాలా పకడ్బందీగా విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణ కోసం సిట్ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఏ టీం వారిని ప్రశ్నిస్తుందో బయటకు ఏమాత్రం పొక్కనీయకుండా చర్యలు తీసుకుంటున్నారు. తొలి రోజు సిట్ కార్యాలయానికి దర్జాగా వచ్చిన పూరీకి సిట్ అధికారుల ప్రశ్నలు, చూపిన సాక్ష్యాలు దిమ్మదిరిగేలా చేశాయి. ఆ విచారణ వివరాలు తెలుసుకుని రెండో రోజు విచారణకు పక్కాప్లాన్డ్ గా వచ్చిన శ్యామ్ కే నాయుడును ముప్పుతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీరు తాగించి, నిజాలు కక్కించారు సిట్ అధికారులు.
ఇక మూడోరోజు మరింత ప్రణాళిక ప్రకారం ఏమీ చెప్పకుండా మొండికేసిన సుబ్బరాజుకు వీడియోలు, ఫోటోలు, ఇతర సాక్ష్యాలు చూపించి, బ్యాంకాక్ నుంచి డ్రగ్స్ తెచ్చి పూరీకి ఇచ్చానని స్వయంగా చెప్పేలా చేశారు. ఇక పూరీ బ్యాచ్ లో కీలకమైన వ్యక్తి సినీ నటి చార్మీ. ఆమె విచారణకు వచ్చిన తరువాత ఈ కేసులో ఎన్నో ట్విస్టులు వెలుగు చూసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పూరీ జగన్నాథ్ తో ఛార్మీకి బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని టాలీవుడ్ లో చాలాకాలంగా గుసగుసలు వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో పూరీ డ్రగ్స్ తీసుకున్నారనేందుకు, అతనికి శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు పూర్తిగా సహకరించారని, డ్రగ్ పెడ్లర్లుగా వ్యవహరించారనేందుకు పూర్తి సాక్ష్యాధారాలను సిట్ సంపాదించింది.
ఈ నేపథ్యంలో పూరీ సంస్థలో ఉద్యోగిగా, వ్యాపార భాగస్వామిగా, క్లోజ్ ఫ్రెండ్ అయిన ఛార్మీ ఎంట్రీ అనంతరం ఈ కేసులో మరిన్ని ట్విస్టులు వెలుగు చూసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే పూరీ, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు విచారణ వివరాలు, సిట్ అధికారుల తీరుతెన్నులు, వేస్తున్న ప్రశ్నల గురించిన పూర్తి వివరాలు తెలుసుకుని, ఛార్మీ పూర్తి సన్నద్ధంగా విచారణకు హాజరయ్యే అవకాశం ఉండడంతో అధికారులు మరింత పకడ్బందీ వ్యూహాలు రచించాల్సిన అవసరం ఉందని అంతా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఛార్మీ విచారణపై సర్వత్రా ఆసక్తి రేగుతోంది.