: 1.8 మిలియన్ డాలర్లు పలికిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ బ్యాగు... చంద్రుని శాంపిల్సే కారణం
చంద్రునిపై అడుగు పెట్టిన మొదటి మానవుడు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్. ఆయన అడుగు పెట్టి 48 ఏళ్లు పూర్తైన సందర్భంగా చంద్రుని మీద శాంపిల్స్ తీసుకురావడానికి ఆర్మ్ స్ట్రాంగ్ ఉపయోగించిన బ్యాగును న్యూయార్క్‌కు చెందిన సూత్‌బై సంస్థ వారు వేలం వేశారు. ఇందులో ఇది 1.8 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. 1969లో అపోలో 11 అంతరిక్ష నౌక ద్వారా చంద్రుని మీదకి వెళ్లిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ఈ బ్యాగులో 500 గ్రా.ల చంద్రుని మట్టిని, 12 చిన్న చిన్న రాళ్లను సేకరించారు. ఆయన భూమ్మీదకి వచ్చాక ఆ బ్యాగును భద్రపరిచారు.
గతేడాది నాసా వారు బయటపెట్టిన ఈ బ్యాగులో ఇప్పటికీ చంద్రుని మట్టి ఆనవాళ్లు ఉన్నట్లు సమాచారం. ఆ కారణంగానే దీన్ని కొనడానికి చాలా మంది ముందుకు వచ్చినట్లు సూత్‌బై ప్రతినిధులు తెలిపారు. దీంతో పాటు అపోలో 11 యాత్రలో ఉపయోగించిన జాబితాలు, వ్యోమగాములు లిఖించిన లెక్కల పత్రాలు, ఉపయోగించిన వస్తువులను సూత్‌బై వారు వేలం వేశారు. వీటి వేలం ద్వారా సూత్‌బై సంస్థకు 3.8 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.