: కొత్త 4జీ ఫోన్ దాదాపు ఉచితమే... ముఖేష్ అంబానీ నోటి నుంచి సంచలన ప్రకటన!
ఇండియాలో తాము విడుదల చేయనున్న సరికొత్త 4జీ ఫోన్ ను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. ఒక స్మార్ట్ ఫోన్ ఎంట్రీ లెవల్ ధర రూ. 3,500 నుంచి రూ. 4 వేలుగా ఉన్న వేళ, తాను ఇండియన్స్ కోసం ఉచితంగానే ఫోన్ ను అందిస్తానని అన్నారు. ఈ మాట ముఖేష్ నోటి నుంచి వచ్చిన వేళ, షేర్ హోల్డర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కొత్త 4జీ ఫోన్ ను పొందేందుకు రూ. 1500 డిపాజిట్ గా చెల్లించాల్సి వుంటుందని, దీన్ని మూడేళ్ల తరువాత పూర్తిగా వెనక్కు ఇచ్చేస్తామని ముఖేష్ అంబానీ ప్రకటించారు.
"మీరు విన్న మాటలు నిజమే. జియో ఫోన్ కస్టమర్లకు ఉచితంగా లభిస్తుంది. ఏదైనా ఉచితమని చెబితే, అది మిస్ యూజ్ అవుతుందన్న సంగతి మీకందరికీ తెలుసు. అందుకే ఈ ఫోన్లు మిస్ యూజ్ కాకుండా చూసేందుకు, ఉచిత జియో ఆఫర్ దుర్వినియోగం కాకుండా చూసేందుకు సెక్యూరిటీ డిపాజిట్ గా రూ. 1500 తీసుకోవాలని నిర్ణయించాం. ఇది మూడేళ్ల తరువాత వెనక్కు ఇచ్చేస్తాం. 36 నెలల పాటు ఫోన్ వాడుకున్న వారికి ఈ డబ్బులు ఇస్తాం. దీంతో నికరంగా ఫోన్ ఉచితంగా వచ్చినట్టు అవుతుంది" అని ముఖేష్ తెలిపారు. భారతీయులందరికీ ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని, ఆగస్టు 15, 2017 భారతదేశ చరిత్రలో డిజిటల్ యుగాన్ని సరికొత్త మైలురాయికి చేరుస్తుందని ముఖేష్ అంబానీ వ్యాఖ్యానించారు. ఈ ఫోన్ ను తాను జాతికి అంకితం చేస్తున్నట్టు అధికారికంగా తెలిపారు.