: భారతీయులు గర్వపడే రికార్డులు మావి: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ
1977లో రూ. 70 కోట్ల ఆదాయంతో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతీయులు గర్వపడే రికార్డులను అందుకుని ప్రస్తుతం రూ. 3.30 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసేంతవరకూ విస్తరించిందని సంస్థ అధినేత ముఖేష్ అంబానీ వెల్లడించారు. రిలయన్స్ 40వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ, 40 ఏళ్ల కాలంలో 4,700 రెట్ల మేరకు ఆదాయాన్ని పెంచుకున్నామని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తొమ్మిది సంవత్సరాల గరిష్ఠ స్థాయిలో రిలయన్స్ ఈక్విటీ విలువ కొనసాగుతోందని, 40 ఏళ్ల నాడు రూ. 3 కోట్లుగా ఉన్న నికర లాభం ఇప్పుడు పది వేల రెట్లు పెరిగి రూ. 30 వేల కోట్లకు దగ్గరైందని, ఇన్వెస్టర్లు తమపై పెంచుకున్న నమ్మకమే ఇందుకు కారణమని ఆయన అన్నారు.
ఇండియా అభివృద్ధితో సమానంగా రిలయన్స్ అభివృద్ధి చెందుతూ వచ్చిందని, సంస్థ ఆస్తుల విలువ రూ. 33 కోట్ల నుంచి 20 వేల రెట్లు పెరిగి రూ. 7 లక్షల కోట్లకు పెరిగాయని చెప్పేందుకు తానెంతో గర్వపడుతున్నానని అన్నారు. మార్కెట్ కాప్ రూ. 10 కోట్ల 50 వేల రెట్లు పెరిగి నుంచి రూ. 5 లక్షల కోట్లకు పైగా పెరిగిందని ముఖేష్ అంబానీ చెప్పారు. 1997లో టెక్స్ టైల్ కంపెనీగా ఉన్న వేళ 3,500 మంది ఉద్యోగులు ఉంటే, ఇప్పుడు సంస్థలో 2.50 లక్షల మంది పని చేస్తున్నారని వెల్లడించారు. ఈ ఏజీఎంకు ముఖేష్ సతీమణి నీతా అంబానీ, తల్లి కోకిలాబెన్, కుమారుడు, కుమార్తె సహా పలువురు ప్రముఖులు, వీఐపీలు హాజరయ్యారు. ముఖేష్ అంబానీ ప్రసంగం కొనసాగుతోంది.