: ఆ శుభ ముహూర్తం నేడే.. మరికొన్ని గంటల్లో జియో నుంచి కీలక ప్రకటన!
ముహూర్త సమయం దగ్గరపడింది. మరికొన్ని గంటల్లో రిలయన్స్ జియో నుంచి కీలక ప్రకటన వెలువడనుంది. సంచలనాలకు కేంద్ర బిందువైన జియో నుంచి ఎటువంటి ప్రకటన వస్తుందా? అని వినియోగదారులు, జియో వ్యూహాలకు అడ్డుకట్టే వేసే వ్యూహాలతో ప్రత్యర్థులు ఎదురుచూస్తున్నారు. శుక్రవారం జియో నుంచి టెలికం రంగంలో ప్రకంపనలు సృష్టించే ప్రకటన వెలువడనుందన్న సమాచారంతో దేశ ప్రజలు మొత్తం అటువైపే దృష్టిసారించారు.
నేటి వార్షిక సాధారణ సమావేశంలో ఆ సంస్థ అధిపతి ముకేశ్ అంబానీ అతి చవకైన 4జీ ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. దీని ధర రూ.500 నుంచి రూ.1500 మధ్య ఉండచ్చు. ఈ ఫోన్ 2.4 అంగుళాల కలర్ డిస్‌ప్లే, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, అవసరమైతే ఎస్డీ కార్డుతో మరింత పెంచుకునే వెసులుబాటు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే రూ.80-రూ.90 మధ్య కొత్త రీచార్జ్ ఆఫర్‌ను కూడా ప్రకటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. జియో ఫైబర్ సర్వీసులను కూడా నేటి సమావేశంలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మూడు నెలల ఉచిత బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించనున్నట్టు తెలుస్తున్నా పూర్తి వివరాలు మాత్రం తెలియరాలేదు.