: 30 రోజులు పెరోల్ మీద వెళ్లి 25 ఏళ్లకు తిరిగొచ్చాడు!
హత్యకేసులో దోషిగా తేలి, సంవత్సరం శిక్ష కూడా అనుభవించి 30 రోజుల పెరోల్‌తో బయటకొచ్చాడో ఖైదీ. తర్వాత మళ్లీ జైలుకు వెళ్లకుండా గల్ఫ్ దేశాలకు పారిపోయాడు. మళ్లీ 25 ఏళ్లకు తానే స్వయంగా తిరిగొచ్చి పోలీసులకు లొంగిపోయాడు. తప్పించుకుని వెళ్లిన వ్యక్తి మళ్లీ తిరిగిరావడానికి చాలా పెద్ద కారణమే ఉంది మరి!
1991లో ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో కొచ్చిలోని మట్టన్‌చెర్రీ ప్రాంతానికి చెందిన నాజర్‌ను కేరళలోని పూళపుర సెంట్రల్ జైలుకి తరలించారు. తర్వాత 1992 డిసెంబర్‌లో 30 రోజులు పెరోల్ మీద బయటికి పంపించారు. కానీ నాజర్ మాత్రం పోలీసుల కళ్లుగప్పి గల్ఫ్ దేశాలకు పారిపోయాడు. అక్కడ రకరకాల పనులు చేసి, చాలా కష్టాలు అనుభవించాడు. ఐదేళ్ల క్రితం గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన నాజర్‌కు కేన్సర్ ఉన్నట్లు తేలింది. దీంతో అతని కుటుంబం చికిత్స కోసం చాలా డబ్బు ఖర్చు చేసింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబాన్ని ఇంకా కష్టపెట్టడం ఇష్టం లేక పూళపుర సెంట్రల్ జైలుకి వచ్చి లొంగిపోయాడు. జైలు అధికారులు మొదట కంగుతిన్నా, రికార్డులు పరిశీలించి నాజర్‌ను మళ్లీ ఖైదీగా జైలులో వేశారు.