: 1944లో గాంధీజీని గాడ్సే నుంచి కాపాడిన స్వాతంత్ర్య సమరయోధుడి మృతి
బిహార్‌కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు భికూ దాజీ భిలారే అలియాస్ భిలారే గురుజీ మరణించారు. 1944లో పంచగని ప్రాంతంలో నాథూరాం గాడ్సే దాడి నుంచి మహాత్మగాంధీని ఈయన కాపాడినట్లు చరిత్రకారులు చెబుతారు. `పంచగనిలో ఉషా మెహతా, ప్యారేలాల్, అరుణా అసఫ్ అలీలతో కలిసి మహాత్మగాంధీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వచ్చిన గాడ్సే, గాంధీ మీద కత్తితో దాడి చేసేందుకు యత్నిస్తుంటే నేను వాడిని అడ్డుకుని చేయి మెలితిప్పి గట్టిగా పట్టుకున్నాను. గాంధీ వదిలేయమని చెప్పిన తర్వాత బయటికి వెళ్లగొట్టాను` అని భిలారే గురుజీ చాలా సార్లు చెప్పారు.
కాకపోతే కపూర్ కమిషన్ మాత్రం భిలాజీ మాటల్లో నిజం లేదని స్పష్టం చేశారు. గాంధీజీ ముని మనవడు తుషార్ గాంధీ ప్రకారం ఆరోజు సమావేశంలో గాడ్సేను భిలారేతో పాటు పురోహిత్ అనే మరో వ్యక్తి కూడా వారించినట్లు తెలుస్తోంది. పురోహిత్ మాత్రం ఈ సంఘటన 1944లో కాదు 1947లో జరిగిందని చెప్పడంతో ఎవరి మాటలు వాస్తవమో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. 1965లో ఈ విషయంపై అధ్యయనం కోసం నియమించిన జేకే కపూర్ కమిషన్ మాత్రం 1944లో మలేరియా సోకడంతో పంచగనిలో గాంధీ విశ్రాంతి తీసుకున్నారని, ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదని తేల్చి చెప్పారు.
ఇదిలా ఉండగా ఆ కాలానికి మరో స్వాతంత్ర్య సమరయోధుడు ఎన్‌డీ పాటిల్ మాత్రం గాంధీజీ మీద ఎవరో దాడి చేస్తుండగా కొంతమంది యువకులు కాపాడారని తాను విన్నట్లు, తర్వాత ఆ యువకుల్లో ముందు నిలబడింది భిలారే గురుజీ అని తెలిసి తమ బృందం మొత్తం అతన్ని కలవడానికి వెళ్లినట్లు, ఆ కాలంలో ఆయనే తమ ఆదర్శమని చెప్పుకొచ్చారు.