: అయ్యప్ప భక్తులకు శుభవార్త... శబరిమలకు 48 కి.మీ దూరంలో ఎయిర్ పోర్టు
కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు ఓ శుభవార్త చెప్పింది. అయ్యప్ప సన్నిధికి 48 కిలోమీటర్ల దూరంలోని కొట్టాయం జిల్లా కంజిరపల్లి తాలూకాలోని చెరువల్లీ ఎస్టేట్ లో 2,263 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును నిర్మించేందుకు కేరళ సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాంతం రెండు జాతీయ రహదారులకు దగ్గరగా ఉండటం, పీడబ్ల్యూడీ రోడ్డుకు దగ్గరగా ఉండటం వల్ల శబరిమలకు మరింత సులువుగా చేరుకునే అవకాశాలు ఉంటాయని అధికారులు అంటున్నారు. నిన్న జరిగిన కేరళ మంత్రివర్గ సమావేశం విమానాశ్రయం నిర్మాణానికి ఆమోదం పలికింది.
కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే శబరిమలకు సమీపంలో ఎక్కడ విమానాశ్రయం నిర్మించవచ్చన్న విషయాన్ని నిర్థారించాలని ప్రభుత్వం నిర్ణయించి, మూడు ప్రాంతాలను గుర్తించింది. చివరకు చెరువల్లి ఎస్టేట్ ను ఎంపిక చేసింది. ఇక నవంబర్ నుంచి జనవరి మధ్య శబరిమలకు కోట్లాది మంది భక్తులు చేరుకుంటారన్న సంగతి తెలిసిందే. ఇక ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే, శబరిమల ప్రయాణం మరింత సులువు కానుంది.