: మీడియా నా జీవితాన్ని నాశనం చేసింది.. మా అమ్మ, భార్య, పిల్లలు ఏడుస్తున్నారు!: ఫేస్‌బుక్‌లో పూరీ ఎమోషనల్ వీడియో వైరల్!
డ్రగ్స్ వ్యవహారంలో బుధవారం సిట్ విచారణకు హాజరైన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ విచారణ అనంతరం ఫేస్‌బుక్‌లో పెట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. మీడియాపై తనకు ఎంతో గౌరవముందని అందులో పేర్కొన్న ఆయన అదే మీడియా ఇప్పుడు తన జీవితాన్ని నాశనం చేసిందన్నారు. వారికి తెలిసినా, తెలియకున్నా బ్రేకింగులు వేసిందన్నారు. ఇది తనను చాలా బాధకు, ఆవేదనకు గురిచేసిందని చెప్పుకొచ్చారు. సిట్ కార్యాలయానికి వెళ్లిన తాను వారు అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పానన్నారు. మళ్లీ వారెప్పుడు పిలిచినా వెళ్తానని పేర్కొన్నారు.
తాను చాలా బాధ్యతాయుతమైన వ్యక్తినని, డ్రగ్సే కాదు.. అసాంఘిక కార్యక్రమాలకు ఎప్పుడూ పాల్పడలేదని, ఇకపైనా అటువంటి పనులు చేయబోనని పేర్కొన్నారు. తనకు కెల్విన్ ఎవరో తెలియలేదని, తనెప్పుడూ ఆయనను కలవలేదని అధికారులకు చెప్పానన్నారు. తనకు పోలీస్ డిపార్ట్‌మెంట్ అంటే ఎంతో గౌరవమని పేర్కొన్నారు. వారిపై చాలా సినిమాలు కూడా చేశానన్నారు. ఇక జర్నలిస్టుల ప్రేరణతో ‘ఇజం’ అనే సినిమాను తీశానని, ఇప్పుడదే జర్నలిస్టులు తన జీవితాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజుల నుంచి తన తల్లీ, భార్య, పిల్లలు ఏడుస్తున్నారన్నారు. మీడియా వ్యవహరించిన తీరు తనను చాలా ఆవేదనకు గురిచేసిందన్నారు. మీడియాలో అందరూ తన స్నేహితులేనని, వారందరూ తర్వాతైనా తనను కలుస్తారని చెప్పుకొచ్చారు. ఏదైనా ఉంటే సిట్ తేలుస్తుందని, అత్యుత్సాహం వద్దని హితవు పలికారు.