: ఆ యువతిని ఫలానా చోట పాతిపెట్టారని చెప్పిన పూనకం వచ్చిన మహిళ...తవ్వకాలు మొదలెట్టిన ప్రజలు!
మంత్రాలకి చింతకాయలు రాలవని ఎంతో మంది, ఎన్నో సంస్థలు మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం తెస్తున్నప్పటికీ ఎన్నో గ్రామాల్లోని ప్రజలు మాత్రం అందులోంచి బయటకు రాలేకపోతున్నారు. ఇటీవలే ఓ వ్యక్తి తనని తాను దేవుడిగా చెప్పుకుని, రహదారి మధ్యలో గోతి తవ్వాలని, అందులో బంగారం దొరుకుతుందని చెప్పిన విషయం తెలిసిందే. ఆ గ్రామస్తులు కూడా ఆ వ్యక్తి చెప్పినట్లే చేశారు. చివరికి ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా కృష్ణా జిల్లా కోడూరు మండలం జరుగువానిపాలెంలో కూడా అటువంటి ఘటనే చోటు చేసుకుంది. ఆ గ్రామంలో ఓ యువతి కనపించకుండా పోయింది. పోలీసులు ఆ యువతి కోసం గాలిస్తూనే ఉన్నారు. ఆమె కనిపించకుండా పోవడంతో ఆ గ్రామంలో అందరూ ఆమె గురించే చర్చించుకుంటున్నారు.
ఇక ఆ యువతి కుటుంబ సభ్యులు మాత్రం మూఢనమ్మకాల వలలో చిక్కుకుని పిచ్చిపిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. పూనకం వచ్చిన ఓ మహిళ వద్దకు వెళ్లిన వారు తమ కూతురు ఏమైందని అడిగారు. దీంతో ఆ మహిళ తనతో దైవమే చెప్పిస్తోందంటూ చెప్పిన ఓ విషయాన్ని విని అంతా షాక్ అయ్యారు. ఆ బాలికను కొందరు దుండగులు చంపేసి, పొలాల్లో పాతేశారంటూ పూనకం వచ్చిన మహిళ చెప్పింది. ఆమె మాటలు నమ్మేసిన గ్రామస్తులు పలుగులు, పారలు చేతపట్టుకుని పొలానికి వెళ్లారు. ఆ మహిళ చూపిన ప్రదేశంలో తవ్వకాలు జరిపారు. తవ్విన కొద్దీ మట్టి వస్తోందే కానీ, ఆ యువతి శరీరం మాత్రం కనిపించలేదు. మరోవైపు ఆ యువతి తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోతోంది.