: ముస్లింను ప్రేమించి.. మతం మారతానన్న కూతురిని చంపేసిన తండ్రి
తన కూతురు ఓ ముస్లిం యువకుడితో ప్రేమలో ఉందని తెలుసుకున్న ఓ తండ్రి దారుణ ఘటనకు పాల్పడిన ఘటన ఇజ్రాయెల్ లోని రామ్లే పట్టణంలో చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో నివసించే సామి కారా (58) అనే ఓ క్రైస్తవుడికి 17 ఏళ్ల కూతురు ఉంది. ఆమె ఓ ముస్లిం యువకుడితో పరిచయం పెంచుకుని, ప్రేమలో పడింది. కూతురి తీరుపై సామి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయినా ఆమె మారలేదు. తనకు ఇష్టం వచ్చినట్లు ఆ యువకుడితోనే తిరుగుతానని చెప్పింది. అంతేగాక, మతం కూడా మార్చుకుంటానని తెలిపింది.
అనంతరం ఈ ఏడాది మే నెలలో తన ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఆ ముస్లిం యువకుడి వద్దకు చేరింది. ఆ యువకుడి తల్లి కూడా ఆ బాలికను బాగా చూసుకుంది. అయితే, తన మాటను వినిపించుకోని కూతురిపై ఆగ్రహం తెచ్చుకున్న సామి ముస్లిం యువకుడిపై, అతడి కుటుంబంపై కేసు పెడతానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక తన తండ్రి వద్దకు మళ్లీ వచ్చేసింది. కొన్ని రోజుల తరువాత తాను ఇస్లాం మతంలోకి మారతానని ఆ బాలిక చెప్పింది. దీంతో సామికి మళ్లీ కోపం ముంచుకొచ్చింది. సామి ఆగ్రహంతో ఊగిపోతూ వంటింట్లోకి వెళ్లి, కత్తి తీసుకొచ్చి కూతురిని పొడిచి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.