: సంచలనం రేకెత్తిస్తున్న కమలహాసన్ ట్వీట్!
ప్రముఖ నటుడు కమలహాసన్ ఈ మధ్య కాలంలో ఏది చేసినా సంచలనంగా మారుతోంది. తాజాగా ఆయన చేసిన ట్వీట్ తమిళనాట రాజకీయ చర్చకు దారి తీసింది. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా 11 లైన్ల పవర్ ఫుల్ కవితను ఆయన పోస్ట్ చేశారు. "ప్రస్తుతం ఎవరూ రాజు కాదు. మనం విమర్శిద్దాం. మనం రాజులం కాము. ఓడినా, మరణించినా, నేను తీవ్రవాదినే. నేను తలచుకుంటే నేనే నాయకుడిని. లొంగి ఉండటానికి నేను బానిసను కాను. కిరీటాన్ని వదిలిపెట్టినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు. నాతో పాటు రండి కామ్రేడ్... అసంబద్ధతను బద్దలు గొట్టే నాయకుడిగా తయారవుతారు" ఈ విధంగా కొనసాగింది ఆయన కవిత్వం.
కమల్ ను ఉద్దేశించి మాట్లాడుతూ తమిళనాడు ఆర్థిక మంత్రి డి.జయకుమార్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలను కమల్ సీరియస్ గా తీసుకున్నారా? ఈ నేపథ్యంలోనే కమల్ ట్వీట్ చేశారా? అనే చర్చ జరుగుతోంది. మరోవైపు కమల్ కు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మద్దతు పలికారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని ఆయన అన్నారు.