: కమల హాసన్‌కు పెరుగుతున్న మద్దతు.. మంత్రుల తీరును ఎండగడుతున్న నేతలు!
తమిళ ప్రముఖ నటుడు కమలహాసన్‌కు క్రమంగా మద్దతు పెరుగుతోంది. అన్నాడీఎంకే నుంచి ఆయనపై ముప్పేట దాడి జరుగుతున్న నేపథ్యంలో విపక్ష నేతలు పలువురు కమల్‌కు మద్దతు తెలిపారు. ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ఉందని, అందులో భాగంగానే కమల్ కూడా తన భావాలను వ్యక్తం చేశారంటూ ఆయనకు అండగా నిలుస్తున్నారు. భావ వ్యక్తీకరణ తప్పెలా అవుతుందో చెప్పాలంటూ నిలదీస్తున్నారు.
డీఏంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, ఎండీఎంకే నేత వైగో, నామ్ తమిళవర్ కట్చి నేత సీమాన్, అన్నాడీఎంకే పురచ్చితలైవి అమ్మ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తదితరులు కమలహాసన్‌కు మద్దతు ప్రకటించారు. కమల్‌పై విరుచుకుపడుతున్న మంత్రుల తీరును దుయ్యబట్టారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు సౌందర్ రాజన్ మాత్రం కమల్‌పై విరుచుకుపడ్డారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్లెత్తు మాటా మాట్లాడని కమల్ ఇప్పుడు ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడు ప్రజా సమస్యలు లేవా? అప్పుడు కుంభకోణాలు జరగలేదా? అని ప్రశ్నించారు.