: వ్యక్తిగతంగా చెప్పాలంటే, వెంకయ్యనాయుడు నాకు దూరమవుతున్నారనే భావన కల్గుతోంది: విష్ణుకుమార్ రాజు


ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడిని ప్రకటించడంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంతోషం వ్యక్తం చేసినప్పటికీ, ఆయన దూరమవుతున్నారనే భావన తనకు వ్యక్తిగతంగా కల్గుతోందని అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘వెంకయ్యనాయుడు గారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించగానే, ఆయన నాకు దూరమవుతున్నారనే భావన కల్గింది. గతంలో, ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా వెంకయ్యనాయుడిగారి ఇంటికే వెళ్లే వాళ్లం. మంచీచెడ్డలు మాట్లాడుకునేవాళ్లం. ఆయన్ని మా సొంత మనిషిలా ఎప్పుడూ భావించేవాళ్లం. ఆయనతో మాట్లాడటమే గొప్పగా భావించేవాళ్లం, ఆయనతో ఉన్నంత సేపూ మాకు అసలు టైమే తెలిసేది కాదు. అటువంటిది, ఆయన ఉపరాష్ట్రపతి అయితే, మాకు అంత చొరవ పోతుంది. ఆయన్ని కలవాలంటే చాలా ప్రొటోకాల్స్ అడ్డురావచ్చు. మనం చేయగలిగిందేమీ లేదు. పార్టీ నిర్ణయించేసింది కాబట్టి, ఆ నిర్ణయం ప్రకారమే మనం నడచుకోవాలి’ అని విష్ణుకుమార్ రాజు చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News