: ఏపీలో డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు సమాచారం ఉంది: హోం మంత్రి చినరాజప్ప
ఏపీలో డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు సమాచారం ఉందని హోం శాఖ మంత్రి చినరాజప్ప అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గంజాయి స్మగ్లింగ్ పై చర్యలు తీసుకుంటున్నామని, ప్రత్యేక బృందాలతో గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తలపెట్టనున్న పాదయాత్ర గురించి ఆయన ప్రస్తావించారు. పోలీసుల పర్మిషన్ తీసుకుని పాదయాత్ర చేయాలని అన్నారు. అసలు, పాదయాత్రపై ముద్రగడకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ ప్రోద్బలంతోనే ముద్రగడ రాజకీయాలు చేస్తున్నారని, మంజునాథ కమిషన్ రిపోర్ట్ ఆలస్యమైందని, దీనిపై కేబినెట్ లో రేపు చర్చిస్తామని చెప్పారు. నాగావళి, వంశధారకు భారీగా వరద నీరు వచ్చిందని, దీంతో, విజయనగరం ప్రాంతానికి వరద ముప్పు ఎక్కువగా ఉందని చెప్పారు. సహాయచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు.