: పెళ్లికాకముందే పిల్లలకు పేరు పెట్టినట్లుంది: వెంకయ్య నాయుడు
ఈ రోజు సాయంత్రం ఎన్డీఏ తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించనున్న నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖల మంత్రి వెంకయ్యనాయుడును బీజేపీ అధిష్ఠానం ఆ రేసులో నిలబెట్టే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు సెంట్రల్ హాల్, రాజ్యసభలో వెంకయ్య నాయుడికి పలువురు ఎంపీలు అభినందనలు తెలిపారు. వెంకయ్యకు అభినందనలు తెలిపిన వారిలో శరద్ పవార్, ఆనంద్ శర్మ, సీతారాం ఏచూరి కూడా ఉన్నారు. అయితే, వారి అభినందనల పట్ల వెంకయ్య నాయుడు తనదైన రీతిలో స్పందిస్తూ చమత్కరించారు. పెళ్లికాక ముందే వారికి పుట్టబోయే పిల్లలకు పేర్లు పెడుతున్నట్లు ఉందని అన్నారు. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి పదవి పట్ల అంతగా ఆసక్తి చూపకపోతుండడంతో ఎన్డీఏ ఎవరిని తమ అభ్యర్థిగా ప్రకటిస్తుందోనన్న అంశంపై ఆసక్తి నెలకొంది.