: విభజన, మతతత్వ శక్తులను దేశం అంగీకరించబోదు.. మా పోరాటం వాటిపైనే!: మోదీపై నిప్పులు చెరిగిన సోనియా
పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ఒకరోజు ముందు బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. సంకుచిత స్వభావంతో విభజిత, మతతత్వ శక్తులను రుద్దాలనుకునే వారిని దేశం అంగీకరించబోదన్నారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో సోనియా గాంధీ మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పోరాటం విభజన, మతతత్వ శక్తులపైనేనని స్పష్టం చేశారు. దేశాన్ని సంకుచిత శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మనస్సాక్షికి అనుగుణంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
ఈ ఎన్నికల ఫలితం తమకు వ్యతిరేకంగా ఉండొచ్చని, కానీ పోరు మాత్రం హోరాహోరీగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి యూపీఏ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి అభ్యర్థులు మీరా కుమార్, గోపాలకృష్ణ గాంధీలు హాజరయ్యారు. కాగా, ఎన్డీఏ అభ్యర్థి కోవింద్‌కు మద్దతు పలికిన జేడీయూ ఈ భేటీకి డుమ్మా కొట్టింది. మీరాకుమార్‌ను వ్యతిరేకిస్తున్న జేడీయూ ఉపరాష్ట్రపతి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకి మద్దతు తెలపడం విశేషం.