: నేతాజీ మరణంపై మరో ట్విస్ట్.. ఆయన విమాన ప్రమాదంలో చనిపోలేదట: సీక్రెట్ ఫ్రెంచ్ రిపోర్ట్ చెబుతున్నది ఇదే!


నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం విషయం మరోమారు చర్చనీయాంశమైంది. ఆయన ఎలా చనిపోయారన్న విషయం తెలుసుకునేందుకు భారత ప్రభుత్వం మూడు కమిషన్లు వేసింది. 1956లో షా నవాజ్ కమిటీ, 1970లో ఖోస్లా కమిషన్, 1999లో ముఖర్జీ కమిషన్‌లు నేతాజీ మరణంపై పరిశోధించాయి. ఆగస్టు 18, 1945లో జపాన్ ఆక్రమిత తైపేయిలోని తైహోకు విమానాశ్రయంలో జరిగిన ప్రమాదంలో నేతాజీ మరణించారని షా నవాజ్, ఖోస్లా కమిషన్‌లు పేర్కొన్నాయి. ముఖర్జీ కమిషన్ మాత్రం చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని స్పష్టం చేసింది. కమిషన్లు ఏం చెప్పినా ఆయన మరణం మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. ఆయన మరణంపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.

తాజాగా సుభాష్ చంద్రబోస్ మరణం విషయం మరోమారు తెరపైకి వచ్చింది. ఆయన విమాన ప్రమాదంలో మరణించలేదని నిర్ధారించిన ఫ్రెంచ్ సీక్రెట్ సర్వీస్ రిపోర్టు ఒకటి బయటపడింది. డిసెంబరు 11, 1947 తేదీతో నేషనల్ ఆర్కివ్స్ ఆఫ్ ఫ్రాన్స్ ‌లో లభ్యమైన ఈ నివేదికను పారిస్‌కు చెందిన చరిత్రకారుడు జేబీపీ మోర్ బయటపెట్టారు. బోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని, 1947 వరకు ఆయన జీవించి ఉన్నారని ఆ నివేదిక సారాంశం.

అందరూ చెబుతున్నట్టు బోస్ ఆగస్టు 18, 1945 నాటి విమాన ప్రమాదంలో మరణించలేదని మోర్ పేర్కొన్నారు. అయితే ఆయన ఇండోచైనా నుంచి తప్పించుకున్నారని, డిసెంబరు 11, 1947 వరకు ఆయన ఎక్కడున్నదీ తెలియరాలేదని మోర్ తెలిపారు. కాగా, సుభాష్ చంద్రబోస్ సైగోన్ నుంచి జపాన్ లోని టోక్యోకు వెళుతుండగా విమాన ప్రమాదంలో మృతి చెందారని బ్రిటన్, జపాన్‌లు ఎప్పుడో ధ్రువీకరించాయి. అయితే ఈ విషయంలో ఫ్రెంచ్ మాత్రం ఇప్పటికీ సైలెంట్‌గానే ఉంది. మరోవైపు ఈ సీక్రెట్ నివేదికను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని స్కాలర్లు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News