: భారత్‌తో చర్చల ముచ్చటే లేదు.. శీతాకాలం వరకు స్టాండాఫ్ కొనసాగుతుంది: స్పష్టం చేసిన చైనా నిపుణులు
డోక్లాం నుంచి భారత బలగాలు వెనక్కి మళ్లే వరకు భారత్‌తో చర్చలకు తావులేదని చైనా నిపుణులు చెబుతున్నారు. శీతాకాలం వరకు చైనా దళాల స్టాండాఫ్ కొనసాగుతుందని చెబుతున్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ నెలాఖరులో చైనాలో పర్యటించనున్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీని డోక్లాం నుంచి వెనక్కి పిలిపిస్తే తప్ప చర్చలు ఉండవనే విషయాన్ని చెప్పేందుకు చైనా ప్రయత్నిస్తోందని వారు తెలిపారు.
బ్రిక్స్ ఆధ్వర్యంలో బీజింగ్‌లో జరగనున్న బహుపాక్షిక భద్రతా చర్చల్లో పాల్గొనేందుకు ఈనెల 27, 28 తేదీల్లో అజిత్ దోవల్ చైనాలో పర్యటించనున్నారు. ప్రస్తుతం సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు చెక్ పెట్టేందుకు ఇదే సమావేశాన్ని దోవల్ ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చైనా తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. డోక్లాం నుంచి భారత బలగాలు వెనక్కి మళ్లితే తప్ప మాటల ముచ్చట లేదన్న విషయాన్ని భారత్‌కు చెప్పేందుకు డ్రాగన్ కంట్రీ ప్రయత్నిస్తోంది.
అయితే శీతాకాలంలో ఇరు దేశాల సైనికులు సరిహద్దు నుంచి వెనక్కి వెళ్లినంత మాత్రాన సమస్య పరిష్కారమైనట్టు కాదని ఓ నిపుణుడు పేర్కొన్నాడు. శీతాకాలం తర్వాత తిరిగి ఇరు దేశాల సైన్యం అక్కడ మోహరిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మీడియా కూడా ప్రజల భావాలను రెచ్చగొడుతోందన్నారు. సంప్రదాయ మీడియా వరకు పరవాలేదు కానీ, రెండు దేశాల్లోని సోషల్ మీడియా అయితే అగ్నికి మరింత ఆజ్యం పోస్తోందని ఆయన వివరించారు.