: ఎమ్మెల్యే అంటే ఏమనుకున్నావ్?.. నీ ఉద్యోగం ఊడదీయిస్తా: అధికారిపై బాబూమోహన్ చిందులు
ప్రముఖ సినీ నటుడు, టీఆర్ఎస్ ఆందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. పంచాయతీరాజ్ ఏఈ చంద్రశేఖర్ పై విరుచుకుపడ్డారు. 'అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేస్తే... నీ ఇష్టం వచ్చిన చోట పనులు చేయిస్తావా?' అంటూ ఆయన నిప్పులు చెరిగారు. 'ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటున్నావ్? నీ ఉద్యోగం ఊడదీయించేస్తా' అంటూ హెచ్చరించారు. రేగోడ్ మండలం కొండాపురం, జగిర్యాల, రేగోడ్ లలో నిన్న జరిగిన హరితహారం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో మొక్కలు నాటడానికి ఆయన వచ్చారు. అయితే, అంతకు ముందు మంజూరు చేసిన సీసీ రోడ్డు ఆయనకు కనిపించలేదు. దీంతో, ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. సీసీ రోడ్డు ఎందుకు నిర్మించలేదంటూ పలువురిని ఆయన ఆరా తీశారు. దానికి సమాధానంగా రోడ్డును మరో చోట నిర్మించారనే సమాధానం వచ్చింది. ఇక్కడ రోడ్డు నిర్మించేందుకు తాను నిధులు మంజూరు చేస్తే... దాన్ని ఇంకో చోట నిర్మించడమేంటని ఏఈపై ఆయన మండిపడ్డారు.