: డ్రగ్స్ కేసులో అధికారికంగా ఎవ్వరి పేర్లనూ వెల్లడించలేదు.. అయినా ఇలా చూపిస్తున్నారు: సీనియర్ నటుడు నరేష్
టాలీవుడ్లో సంచలనం కలిగిస్తోన్న డ్రగ్స్ వ్యవహారంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్పందించింది. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ... రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో సినీ ప్రముఖులే కాకుండా ప్రజలు కూడా షాక్కు గురవుతున్నారని అన్నారు. డ్రగ్స్ కోరల్లో ప్రపంచమంతా చిక్కుకుందని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ కి సినీ పరిశ్రమ వ్యక్తులే కాదని, మనీ, పవర్ ఉన్న ఇతర రంగాల వ్యక్తులు కూడా బానిసలయ్యారని అన్నారు. స్కూళ్లలోనూ డ్రగ్స్ వ్యవహారం వెలుగు చూసిందని చెప్పారు. ఇది కొంతమంది వ్యక్తిగత వ్యవహారమే కానీ సినిమా పరిశ్రమ మొత్తం ఇందులో ఉన్నట్లు కాదని వ్యాఖ్యానించారు.
చట్టం తనపని తాను చేసుకుంటూ పోతోందని, పోలీసులు ఇంతవరకు అధికారికంగా ఎవ్వరిపేర్లను వెల్లడించలేదని నరేష్ అన్నారు. అయినప్పటికీ చాలా మంది పేర్లను టీవీల్లో వేసి వారి ఫొటోలని చూపిస్తున్నారని అన్నారు. ఈ విషయంపై అధికారికంగా పేర్లు బయటికి వస్తే మాట్లాడడానికి ఏమైనా ఉంటుందని, అధికారులు ప్రకటించక ముందే ఇలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు.
యువ నటుడు తనీశ్ మానసికంగా చాలా దెబ్బతిన్నాడని, ఇటీవల తండ్రిని కూడా కోల్పోయాడని నరేష్ అన్నారు. ప్రధానంగా మీడియా ఎప్పుడూ సినీ పరిశ్రమకి దగ్గరగానే ఉంటుందని, అటువంటి మీడియా సంయమనం పాటించాలని కోరారు. డ్రగ్స్ సరఫరా అనేది పెద్ద ఇష్యూ అని, దాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వాలు, పోలీసులు పోరాడుతున్నారని అన్నారు. తాము కూడా సహకరించాలని, అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ రోజు ఎంతో మంది సినీ ప్రముఖుల పేర్లు వచ్చాయని, తప్పుడు పేర్లు మీడియాలో వచ్చాయని అన్నారు. దీన్ని సెన్సేషన్ చేయకూడదని కోరారు.