: ప్రపంచంలో మొదటి రోబో లాయర్.... త్వరలో భారత్‌కి!
లండన్‌లో పుట్టిన జోషువా బ్రౌడర్‌కి డ్రైవింగ్ సరిగా రాదు. దీంతో మాటిమాటికి కారును రాంగ్ పార్కింగ్ చేయడం వల్ల జరిమానాలు చెల్లించాల్సి వచ్చేది. లండన్‌లో రాంగ్ పార్కింగ్ జరిమానా చాలా పెద్దమొత్తంలో ఉంటుంది. దాని నుంచి మినహాయింపు పొందాలంటే తప్పుగా ఎందుకు పార్క్ చేశారో కోర్టులో వివరణ ఇచ్చుకోవాలి. అది కూడా చట్టంలో వివరించిన కారణాలు మాత్రమే చూపించి, వాటికి మద్దతుగా సరైన రుజువులు సమర్పిస్తేనే రాంగ్ పార్కింగ్ జరిమానా నుంచి విముక్తి లభిస్తుంది. చట్టంలో వివరించిన కారణాలు చదివి, అర్థం చేసుకునే సరికి పార్కింగ్ జరిమానా చెల్లించే రోజు రానే వస్తుంది. దీంతో వారు అడిగినంత చెల్లించుకోవాల్సి వస్తుంది.
ఈ సమస్య నుంచి గట్టెక్కించడానికి జోషువా బ్రౌడర్ ఒక రోబోను కనుగొన్నాడు. ఒక వెబ్‌సైట్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. దీని పేరు `డునాట్‌పే`. ఇందులో పార్కింగ్ జరిమానా ఎందుకు కట్టాల్సి వస్తుందో కారణాలు చెప్తే సరిపోతుంది. కోర్టులో సమర్పించాల్సిన కారణాలను, రుజువులను 30 సెకన్లలో ఇది మీ ముందుంచుతుంది. మొదట్లో రాంగ్ పార్కింగ్ కేసులు గెలవడానికే సహాయపడిన ఈ రోబో ప్రస్తుతం ఇంటి యజమానితో సమస్యలు, వినియోగదారుల చట్టానికి సంబంధించిన కేసులకు కూడా రుజువులను, సలహాలను ఇస్తోంది. ఇప్పటికే బ్రిటన్, అమెరికా దేశాల్లో బాగా పాప్యులర్ అయిన ఈ రోబో లాయర్‌ను త్వరలో భారతదేశానికి కూడా తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు దాని సృష్టికర్త జోషువా బ్రౌడర్ తెలిపారు.