: చెన్నై సూపర్ కింగ్స్ పై ముగిసిన నిషేధం... తమిళ తంబీల ఆనందం వర్ణనాతీతం
2013 ఐపీఎల్ పోటీలు జరుగుతున్న సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ అధికారులు గురునాథ్ మెయ్యప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రాలు మ్యాచ్ ఫిక్సింగ్ సహా పలు అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలపై రెండేళ్ల పాటు విధించిన నిషేధం గురువారంతో తొలగిపోయింది. 2016, 2017 సీజన్ పోటీల్లో ఈ రెండు టీములూ పాల్గొనలేదన్న సంగతి తెలిసిందే. ఇక తమ టీమ్ పై నిషేధం తొలగిపోయిందన్న ఆనందంలో తమిళ తంబీలు సోషల్ మీడియా వేదికగా ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తున్నారు. తదుపరి సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి సత్తా చాటుతుందని అంటున్నారు. 'సీఎస్కే రిటర్న్స్', 'విజిల్ పోడు', 'సీఎస్కే ఫ్రెండ్స్' అనే హ్యాష్ ట్యాగ్స్ జత చేసి తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడినప్పటి, మధురానుభూతులను నెమరు వేసుకుంటున్నారు.
ఎల్లో జర్సీ, ధర్మశాలలో సిక్స్, ఆర్సీబీపై 28 పరుగులు, నో బాల్ తో గెలుపు, తొలి ఫైనల్ మ్యాచ్, ఎంగా తల్లా ధోనీ అంటూ సాగిన ప్రచారం, బ్రావో డ్యాన్స్, రైనా ఎలుగుబంటి కౌగిలింత, అద్భుతమైన క్యాచ్ లు, మురళీ 800, ఆశ్విన్ వర్సెస్ గేల్, సూపర్ ఓవర్లు, ఆఖరి బాల్ విజయాలు, గెలిచిన టైటిళ్లు, ఆరంజ్, పర్పుల్, ఎల్లో క్యాప్ లు, స్టేడియంలో విజిల్స్ తదితరాలను ప్రస్తావిస్తూ పోస్టుల మీద పోస్టులు, పాత చిత్రాలను పెడుతున్నారు. కాగా, ఐపీఎల్ టీములన్నింటిలో అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన టీముగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2010, 2011 సంవత్సరాల్లో ట్రోఫీలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ధోనీ, సురేష్ రైనా, బ్రావో, అశ్విన్, జడేజా వంటి ప్రముఖులు ఇందులో ఆడారు.