: ఇన్ఫోసిస్ సీక్రెట్ లక్ష్యాలు వెల్లడించిన విశాల్ సిక్కా
ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా తమ కంపెనీ సీక్రెట్ లక్ష్యాలను బయటపెట్టారు. జూన్ క్వార్టర్ ఫలితాలు వెల్లడించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇన్ఫోసిస్ రెవెన్యూను పెంచుకునేందుకు కొత్త టెక్నాలజీపై దృష్టిపెట్టనున్నామని తెలిపారు. రోబోటిక్స్, ఏఐ, డ్రైవర్ లెస్ కార్లు వంటివాటిపై ప్రధానంగా దృష్టిసారించనున్నామని చెప్పారు. ఇందులో భాగంగా మైసూర్ లోని తమ ఇంజనీరింగ్ సర్వీసెస్ ను పూర్తిగా డ్రైవర్ లెస్ కార్ల అభివృద్ధికే కేటాయించామని తెలిపారు. గతంలో తమ రెవెన్యూలో 10 శాతం కొత్త టెక్నాలజీ, సర్వీసుల నుంచే వచ్చిందని ఆయన తెలిపారు.
గతంలో తాము దృష్టి పెట్టిన సర్వీసులు రెండేళ్ల క్రితం మార్కెట్ లో లేనేలేవని అన్నారు. స్వతంత్ర, అనుసంధాన వాహనాలకు అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని తాము వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుంటామని ఆయన తెలిపారు. తమ ఈ నూతన దృష్టికోణం సరికొత్త వ్యాపార అవకాశాలతో పాటు వేలకొద్దీ ఇంజనీరింగ్ నిపుణులు, రెవెన్యూను సృష్టిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ క్వార్టర్ లో తమ సంస్థ అంచనాలను మించి రాణించి, 3,483 కోట్ల రూపాయల నికరలాభాలను ఆర్జించిందని ఆయన తెలిపారు.