: డ్రగ్స్ తో నాకు సంబంధం లేదు... విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి... అసత్యపు ఆరోపణలు వద్దు: నవదీప్
డ్రగ్స్ ముఠాతో తనకు ఎలాంటి సంబంధం లేదని హీరో నవదీప్ తెలిపాడు. కెల్విన్ తన పేరు చెప్పాడని మీడియా చెబుతుండడంతో ఆశ్చర్యపోయానని నవదీప్ అన్నాడు. గత నెలలో రాంగ్ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థతో అసోసియేట్ అవ్వడం వల్ల తన పేరు బయటకు వచ్చిఉంటుందని నవదీప్ అనుమానం వ్యక్తం చేశాడు. అంతే కాకుండా గతంలో డ్రగ్స్ అంశంలో పేర్లు వెలుగు చూసిన వారిని కూడా విచారణకు పిలుస్తున్నట్టు తనకు సమాచారం ఉందని అన్నాడు.
ఈ డ్రగ్స్ దందా తానే నడుపుతున్నట్టు మీడియా కథనాలు ప్రసారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు నోటీసులు వచ్చిన మాట వాస్తవమేనని చెప్పిన నవదీప్, తనకు, డ్రగ్స్ దందాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. సిట్ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని నవదీప్ చెప్పాడు. అంతవరకు మీడియా ఓపిక పట్టాలని సూచించాడు. దేనినో దేనితోనో లింక్ చేస్తూ తనపై చేస్తున్న దుష్ప్రచారం ఆపాలని నవదీప్ కోరాడు. తనను బద్నాం చేయవద్దని మీడియాకు నవదీప్ సూచించాడు.