: నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల్లో హైదరాబాద్ లో ఉన్నదెవరు? లేనిదెవరు?


డ్రగ్స్ వివాదంలో ఎక్సైజ్ శాఖ నోటీసులను అందుకున్న హీరోలు రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, హీరోయిన్లు చార్మి, ముమైత్ ఖాన్, దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు సహా నందు, శ్రీనివాసరావు, సుబ్బరాజు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా తదితరుల్లో కొంతమంది మాత్రమే హైదరాబాద్ లో ఉండి స్వయంగా నోటీసులు అందుకోగా, మిగతా వారి ఇళ్లకు, ఆఫీసులకు వెళ్లిన పోలీసులు అక్కడున్న వారికి నోటీసులు ఇచ్చి వారి సంతకం తీసుకున్నారు.

దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రస్తుతం హైదరాబాద్ లో లేకపోగా, ఆయన ఇంటికి వెళ్లి, అక్కడున్న ఆయన బంధువులకు నోటీసులు ఇచ్చారు. చార్మీ హైదరాబాద్ లో లేకపోవడంతో ఆమె ఆఫీసుకు వెళ్లిన అధికారులు అక్కడి మేనేజర్ కు నోటీసులు ఇచ్చారు. ముమైత్ ఖాన్ కూడా హైదరాబాద్ లో లేకపోవడంతో, ఇక్కడ ఆమె డేట్స్ పరిశీలించే మేనేజర్ కు నోటీసులు స్వయంగా ఇచ్చారు. ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, తరుణ్, సుబ్బరాజు ఇళ్లకు వెళ్లిన సిట్ సిబ్బంది వారి సమీప బంధువులకే నోటీసులు ఇచ్చారు.

అధికారులు వెళ్లిన సమయంలో నవదీప్ ఇంట్లోనే ఉండగా, అతనికే స్వయంగా నోటీసులు ఇచ్చారు. రవితేజ షూటింగ్ లో ఉండగా, ఆయన ఇంటికెళ్లి దగ్గరి బంధువుకు విషయం చెప్పి, నోటీసులు ఇచ్చి, అవి అందినట్టు సంతకం తీసుకున్నారు. శ్రీనివాసరావు కూడా స్వయంగా నోటీసు అందుకున్నట్టు తెలుస్తోంది. తనీష్, నందులకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా ఎవరూ అందుబాటులో లేరని సమాచారం. వారికి నోటీసులను ఇచ్చేందుకు నేడు మరోసారి పోలీసులు వెళ్లనున్నారు.

కాగా, స్వయంగా నోటీసులు అందుకున్న వారు మాత్రం తప్పనిసరిగా 19 నుంచి వారం రోజుల్లోపు సిట్ విచారణకు హాజరు కావాల్సిందే. మిగతా వారి ముందు మాత్రం మరో ఆప్షన్ ఉంటుంది. నోటీసులు ప్రత్యక్షంగా తీసుకోలేదు కాబట్టి, వారికి ఇంకొంత గడువు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News