: మోదీ గొప్ప నాయకుడా? ఇందిరాగాంధీపై వ్యక్తిగత విమర్శలు బాధను కలిగిస్తున్నాయి: సినీ నటుడు శివాజీ
కాంగ్రెస్ పార్టీ మీద సోషల్ మీడియాలో వస్తున్న దారుణమైన కామెంట్లు తనకు బాధను కలిగిస్తున్నాయని... ఈ దేశానికి ఆ పార్టీ కూడా ఎంతో కొంత చేసిందనే విషయాన్ని మనం గమనించాలని సినీ నటుడు శివాజీ కోరారు. వెంకటేశ్వరస్వామి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన ప్రధాని మోదీని గొప్పవాడిగా, యోగ్యుడిగా, దేశాన్ని రక్షించడానికి వచ్చిన గొప్ప నేతగా మనం భుజాన మోయడం సరైంది కాదని అన్నారు. మోదీ కూడా ఇచ్చిన మాటను తప్పారని విమర్శించారు.
మన దేశంలో జరిగిన గొప్ప ఆర్థిక సంస్కరణల్లో బ్యాంకుల జాతీయీకరణ ఒకటని... అది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేశారని చెప్పారు. ఆమె వ్యక్తిగత విషయాలపై దిగజారుడు రాజకీయాలు చేయడం అత్యంత దారుణమని అన్నారు. గతంలో ఎంతో నిజాయతీగా బీజేపీకి పని చేశానని... ఇప్పుడు ఆ పార్టీతో తనకు సంబంధం లేదని చెప్పారు.