: ఇదో ఆధునిక భారతం... భార్యను జూదంలో ఓడి దుశ్శాసనులకు అప్పగించిన భర్త!
మహాభారతంలో ధర్మరాజు భార్యను జూదంలో పణంగా పెట్టిన ఘటనను ఆదర్శంగా తీసుకున్న ఓ వ్యసనపరుడు, తన భార్యను పణంగా పెట్టి జూదంలో ఓడి దుశ్శాసనులకు అప్పగించిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఇండోర్ లోని పోలీసులు నిర్వహించే పబ్లిక్ హియరింగ్ లో మహిళ వెల్లడించిన వివరాల ప్రకారం... ఆమె భర్త జూదానికి బానిసయ్యాడు. జూదానికి డబ్బుల్లేక తన భార్యను పందెం కాశాడు. అందులో ఓటమిపాలై, తన భార్యను వారికి అప్పగించాడు.
దీంతో ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో ఈ దారుణాన్ని సహించని ఆమె అతని నుంచి విడిపోయింది. అయినప్పటికీ వారి వేధింపులు మాత్రం ఆగడం లేదు. దీంతో ఆమె ఇండోర్ పోలీస్ స్టేషన్ మహిళా ఇన్ ఛార్జి జ్యోతి శర్మ నిర్వహించే పబ్లిక్ హియరింగ్ లో వివరాలను వెల్లడించారు. తన భర్తతో పాటు కీచకులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే దీనిని నిర్థారించుకోకపోవడంతో ఇంకా కేసు నమోదు చేయలేదని పోలీసు అధికారిణి తెలిపారు.