: మాదాపూర్ లో బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్ వేర్ సంస్థ!
హైదరాబాద్ లోని మాదాపూర్ లో ‘సెరినక్స్’ అనే సాఫ్ట్ వేర్ సంస్థ నిరుద్యోగులకు టోకరా ఇచ్చింది. సుమారు 120 మంది నిరుద్యోగుల నుంచి కోటిన్నర రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడింది. మాదాపూర్ పోలీసులకు బాధితులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు, సదరు సంస్థకు ఎండీలుగా వ్యవహరిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 27 కంప్యూటర్లు, 12 ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ, సెరినక్స్ పేరిట సాఫ్ట్ వేర్ కంపెనీని ప్రారంభించిన వీరు, అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేవారు. మంచి ప్యాకేజ్ తో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, ఒక్కో వ్యక్తి నుంచి లక్ష లేదా లక్షన్నర రూపాయల వరకు వసూలు చేశారు. అయితే, ఎన్ని నెలలు గడుస్తున్నా జీతాలు ఇవ్వకపోవడంతో విసిగిపోయిన సదరు ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.