: ఉగ్రవాదులతో పోరాడేందుకు గోరక్షకులను పంపగలరా?: బీజేపీకి శివసేన అధినేత సవాల్!
జమ్మూకశ్మీర్ లో అమర్ నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బీజేపీకి సవాల్ విసిరారు. కశ్మీర్ లో ఉగ్రవాదులతో పోరాడేందుకు గోరక్షకులను పంపించాలని బీజేపీకి సవాల్ విసిరారు. మతం, రాజకీయం జతకలిసి ఉగ్రవాదం రూపంలో చెలరేగిపోతోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గణేష్ మండల్స్ తో త్వరలో జరగనున్న పండగ ఏర్పాట్లపై చర్చించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రస్తుతం గో రక్షక్షులు సమస్యాత్మకంగా మారారని అన్నారు. గోవులను రక్షిస్తున్నామని చెప్పుకుంటూ సామాన్యులపై దాడులకు పాల్పడే గో రక్షకులు... దేశానికి, దేశ ప్రజలకు ఎంతో హాని తలపెడుతున్న ఉగ్రవాదులను ఎదుర్కోగలరా? అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ ఎంతగానో మద్దతిచ్చే గో సంరక్షకులను ఉగ్రవాదులపై యుద్ధం చేసేందుకు పంపించాలని ఆయన సూచించారు. అలా చేస్తే బీజేపీకి ఉగ్రవాద తీవ్రత అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ వేర్పాటు వాదులతో చర్చించి, అక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆయన సూచించారు. లేకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆయన తెలిపారు. పండగల నేపథ్యంలో హైకోర్టు శబ్దతీవ్రతపై ఆంక్షలు విధించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, వాటిని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆయన ఫడ్నవీస్ ప్రభుత్వానికి సూచించారు.