: ముంచుకొస్తున్న మరో ఉపద్రవం... త్వరలో మరో జీవ వినాశనం!
మరోసారి ఉపద్రవం ముంచుకొస్తోంది. భూమిపై ఇంకోసారి జీవ వినాశనం జరగనుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూమి చరిత్రలో ఆరో వినాశనం దగ్గర్లోనే ఉందని చెబుతున్న శాస్త్రవేత్తలు అందుకు పలు ఆధారాలను చూపుతున్నారు. జనాభాతో పాటు, పర్యావరణానికి హాని కలిగించే వస్తు వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోవడంతో వన్యప్రాణులు కనుమరుగవుతున్నాయని వారు తెలిపారు.
మనిషి ప్రవర్తనతో ఇప్పటికే వందలాది కోట్ల ప్రాంతీయ, స్థానిక జీవజాతులు అంతర్ధానమయ్యాయని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ లో తాజా అధ్యయనం ప్రచురితమైంది. భూతాపంపై జరుపుతున్న పరిశోధనల్లో భాగంగా జరిగిన పరిశోధనల్లో... భూమిపై వందలాది కోట్ల క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయ చరాలు కనుమరుగు అయ్యాయని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతోనే భూమి గతంలో కంటే వేగంగా వినాశనాన్ని కొనితెచ్చుకుంటోందని నిర్ధారణకు వచ్చినట్టు వారు తెలిపారు.
నాగరిక సమాజం జీవసమతౌల్యాన్ని దెబ్బతీసిందని, దీని కారణంగానే జీవవిధ్వంసానికి పాల్పడి వినాశనాన్ని కొని తెచ్చుకుంటోందని వారు తెలిపారు. గడచిన శతాబ్ద కాలంలో భూమిపై ఉన్న సగం క్షీరదాలు కనుమరుగయ్యాయని వారు చెబుతున్నారు. అందువల్ల ఎదురయ్యే పర్యావరణ, ఆర్థిక, సామాజిక పర్యవసానాలను మానవజాతి కచ్చితంగా ఎదుర్కొనాల్సిందేనని వారు సూచించారు.
కాగా, ఆరు కోట్ల 60 లక్షల ఏళ్ల కిందట తొలి జీవ వినాశనం సంభవించిందని వారు ఈ జర్నల్ కథనంలో పేర్కొన్నారు. అప్పుడు సంభవించిన నాశనంలో రాక్షసబల్లులు (డైనోసార్లు) అంతరించిపోగా, తరువాత నాలుగు దశల్లో పలు జీవజాతులు అంతరించిపోయాయని, ఇప్పుడు రానున్న ఆరో వినాశనంలో గతం కంటే ఎక్కువ వినాశనం జరుగుతుందని, గతంలో కంటే వందరెట్ల వేగంతో వన్యప్రాణులు కనుమరుగవుతాయని వారు హెచ్చరించారు.