: భారత్ ఆధిపత్య ధోరణి, అహమే ఉద్రిక్తతకు కారణం.. మరోమారు విరుచుకుపడిన 'డ్రాగన్' మీడియా
భారత్‌పై డ్రాగన్ (చైనా) మీడియా మరోమారు అక్కసు వెళ్లగక్కింది. ఇండియా ఆధిపత్య ధోరణి, అహమే (ఇగో) ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణమని ఆక్షేపించింది. చైనాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆధిపత్య ధోరణి అవలంబిస్తోందని చైనా అధికారిక మీడియా జిన్హువా న్యూస్ ఏజెన్సీ ఆరోపించింది. తమ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని తొలుత భారత్ తప్పుడు ఆరోపణలు చేసిందని, తర్వాత మాటమార్చి భూటాన్‌ను రక్షించేందుకే తమ దళాలు డోక్లాంలో తిష్టవేశాయని చెప్పిందని పేర్కొంది. ఈ సందర్భంగా భారత్ 1962 నాటి దేశం కాదన్న కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలను ప్రస్తావించింది.
డోక్లాం ప్రాంతం ఎప్పుడో చైనా సార్వభౌమ భూభాగంలో కలిసిందని, చరిత్ర ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతోందని పేర్కొంది. కాబట్టి డోక్లాం విషయంలో భారత్ వాదన అర్థం లేనిదని కొట్టిపడేసింది. కాగా, భూటాన్ త్రికూడలిలో గత మూడు వారాలుగా నెలకొన్న స్టాండాఫ్‌పై వరుస కథనాలు ప్రచురిస్తున్న చైనా మీడియా తాజాగా అహం, అధిపత్య ధోరణి కనబరచాలనే భావన భారత్‌లో బలంగా నాటుకుపోయిందని విమర్శించింది. తమ సార్వభౌమాధికారం విషయంలో ఏ దేశం కూడా ఒత్తిడి తీసుకురాలేదని తేల్చి చెప్పింది.