: ప్రేమ ముసుగులో పాడు చేశాడు...కాబోయే భర్తకు ఆ ఫోటోలు పంపిన ప్రబుద్ధుడి అరెస్టు
యువతిపై అత్యాచారానికి పాల్పడి ఆ సందర్భంగా తీసిన ఫోటోలు ఆమెకు కాబోయే భర్తకు పంపిన యువకుడు అరెస్టయ్యాడు. ఘటన వివరాల్లోకి వెళ్తే... చెన్నైలోని ట్రిప్లికేన్ కు చెందిన యువతి (22) కీల్పాక్కంలోని ప్రైవేటు కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి హర్డిల్స్ క్రీడాకారుల శిక్షణా కేంద్రం నిర్వహిస్తున్నారు. అందులో టీపీ సత్రం జ్యోతియమ్మాల్ నగర్ కు చెందిన దీపక్ అలియాస్ డేనియల్ (22) శిక్షణ పొందుతున్నాడు. తండ్రి నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రానికి సదరు యువతి తరచు వస్తుండేది. దీంతో గురువు కుమార్తెతో దీపక్ స్నేహంగా మెలిగేవాడు. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమించుకున్నారు. వారి ప్రేమ విషయం తెలియడంతో ఆమె తండ్రి ఆగ్రహం తెచ్చుకుని, వెంటనే ఆమెకు మంచి సంబంధం చూసి, పెళ్లి కుదిర్చారు.
దీంతో ఈ విషయంపై మాట్లాడదామని పిలిచి, తన స్నేహితుడి గదికి తీసుకెళ్లిన దీపక్ ఆమెకు శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చి, అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను వివాహం చేసుకోవాలని కోరాడు..దీంతో పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటానని ఆమె స్పష్టం చేసింది. దాంతో ఆమెతో గడిపినప్పుడు రహస్యంగా తీసిన ఫోటోలు చూపించడంతో అతని దుర్బుధ్ధిని గ్రహించి అతనికి దూరమైంది. గత నెల నుంచి ఆమె అతనితో మాట్లాడడం మానేసింది. ఫోన్ లో ప్రయత్నించినా దొరకడం లేదు. దీంతో ఆగ్రహానికి గురైన దీపక్ రహస్యంగా తీసిన ఫోటోల్లో ఒక ఫోటోను ఆమెకు కాబోయే భర్తకు వాట్స్ యాప్ లో పంపించాడు. ఇది యువతికి తెలియడంతో నేరుగా వెళ్లి కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు కీల్పాక్కంలోని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డేనియల్ ను అదుపులోకి తీసుకుని విచారించగా, తప్పు చేసినట్టు అంగీకరించాడు.