: నాకు ముందుగా చిరంజీవి.. తర్వాతే పవన్ కల్యాణ్ స్ఫూర్తి!: వరుణ్ తేజ్
పవన్ కల్యాణ్ హీరో కాకముందే పెదనాన్న తనకు ఇన్స్పిరేషన్ అని, తను ఈ స్థాయికి రావడానికి మొదటి ఆదర్శం ఆయనేనని, తర్వాతే బాబాయ్ పవన్ కల్యాణ్ అని హీరో వరుణ్ తేజ్ అన్నాడు. సోమవారం సాయంత్రం జరిగిన `ఫిదా` ఆడియో రిలీజ్ వేడుకలో ఆయన భావోద్వేగంతో మాట్లాడాడు. మెగా హీరోలు ఎవరూ రాకపోయినా వారి అభిమానులు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు. కెరీర్ పరంగా ఇప్పటికి రెండు మూడు సార్లు తప్పటడుగు వేశానని, ఇక నుంచి మంచి సినిమాలు చేసి మెగా అభిమానులు తలెత్తుకునేలా చేస్తానని వరుణ్ ప్రామిస్ చేశాడు.
సినిమా గురించి మాట్లాడుతూ, 'ఇందులో హీరోయిన్ పవన్ కల్యాణ్ కి ఫ్యాన్ అని దర్శకుడు నాకు చెప్పగానే ఆ విషయం నాకు నచ్చలేదు. ఎందుకంటే, మామూలుగా పవన్ గారికి నేను కదా ఫ్యాన్ ని! కానీ శేఖర్ కమ్ముల చెప్పిన మాటలకు కన్విన్స్ అయ్యాను' అన్నాడు వరుణ్. ఈ సినిమాలో హీరోయిన్ పవన్ కల్యాణ్ డైలాగులు చెబుతుందని, అవి అభిమానులకు బాగా నచ్చుతాయని చెప్పాడు. అలాగే ఇది కుటుంబసమేతంగా చూడాల్సిన ఫీల్ గుడ్ సినిమా అని, పాటలు, లోకేషన్లు, డైలాగులు బాగా వచ్చాయని వివరించాడు. వరుణ్ తేజ్, సాయిపల్లవి జంటగా నటించిన `ఫిదా` సినిమా జూలై 21న విడుదలకానుంది.