: ఉగ్ర ఘాతుకం వెనుక ఎల్ఈటీ మాస్టర్ మైండ్ అబూ ఇస్మాయిల్... ప్రతీకారం తప్పదన్న భారత్
నిన్న అమర్ నాథ్ యాత్రకు వెళుతున్న వారిపై ఘాతుకానికి దిగి ఏడుగురిని బలిగొన్న ఉగ్రవాదుల వెనుక లష్కరే తోయిబా మాస్టర్ మైండ్ అబూ ఇస్మాయిల్ ఉన్నాడని కాశ్మీర్ పోలీసులు స్పష్టం చేశారు. పాకిస్థాన్ కు చెందిన అబూ, యాత్రికులపై దాడికి ప్లాన్ చేశాడని తేల్చారు. పోలీసు చెక్ పోస్టుకు కేవలం 600 మీటర్ల దూరంలో యాత్రికుల బస్సును మూడు వైపుల నుంచి చుట్టు ముట్టిన ముష్కరులు విచక్షణా రహితంగా కాల్పులకు దిగిన సంగతి తెలిసిందే.
కాల్పులు జరిపిన తరువాత ఉగ్రవాదులు పారిపోగా, వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని ఓ అధికారి వెల్లడించారు. ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. కాగా, ఈ సంవత్సరం ఇప్పటివరకూ లక్ష మందికి పైగా యాత్రికులు అమరనాథుడిని దర్శించుకున్నారు. ఘటనపై స్పందించిన కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ, ఈ దాడితో ప్రతి కాశ్మీరీ సిగ్గుతో తల దించుకునే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. మాటలకందని బాధ తనలో కలిగిందని, ఈ తరహా దాడులతో దేశాన్ని దెబ్బతీయలేరని అన్నారు.