: వైసీపీ నేతలూ.. పిచ్చపిచ్చగా మాట్లాడితే నాలుకలు చీరేస్తాం: దేవినేని అవినాష్ హెచ్చరిక
టీడీపీ నేతలపై అవినీతి ఆరోపణలు చేసి జగన్ మెప్పు పొందాలని వైసీపీ నేతలు చూస్తున్నారని, పిచ్చపిచ్చ ఆరోపణలు చేసే వారి నాలుకలు తెగ్గోస్తానని తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు దేవినేని అవినాష్ హెచ్చరించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేవలం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ లపై ఆరోపణలు చేసేందుకే వైసీపీ ప్లీనరీ పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబును విమర్శించడం సబబు కాదని, తమ మూడేళ్లలో పాలనలో ఏవైనా లోపాలు ఉంటే ఎత్తి చూపితే, సరిచూసుకుంటాం తప్పా, ఈవిధంగా లేనిపోని ఆరోపణలు చేయడం కరెక్టు కాదని, వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడే భాష చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు.
చంద్రబాబునాయుడిపై వైసీపీ నేతలు నోరుపారేసుకున్న దాని కంటే రెండు రెట్లు ఎక్కువగా జగన్ ని తాము తిట్టగలం కానీ, చంద్రబాబు తమకు క్రమశిక్షణ, సంస్కారం నేర్పించారు కనుక అటువంటి రీతిలో తాము ప్రవర్తించమని చెప్పారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు వైసీపీ రూ.50 కోట్లు ఇచ్చి తెప్పించుకుందని, యాభై కోట్లు కాదు కదా ఐదు వందల కోట్లు వెచ్చించినా వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీయేనని, మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబేనని దీమా వ్యక్తం చేశారు.