: జగన్ కు తన నాయకత్వం మీద తనకే నమ్మకం లేదు.. అందుకే ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకున్నారు: నారా లోకేశ్
వైసీపీ అధినేత జగన్ కు ఆయన నాయకత్వంపై ఆయనకే నమ్మకం లేదని ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. అందుకే ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ అసూయపడుతున్నారని... అందుకే ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత 40 ఏళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాల్లో కొనసాగుతున్నారని... ఆయనపై ఎంతో మంది ఆరోపణలు చేశారని, అయినా ఎవరూ ఒక్క ఆరోపణను కూడా నిరూపించలేక పోయారని అన్నారు.
కేవలం చంద్రబాబును తిట్టడానికే వైసీపీ ప్లీనరీని ఏర్పాటు చేసినట్టు ఉందని చెప్పారు. ప్లీనరీలో జగన్ ఇచ్చిన హామీల్లో కొత్తదనమేమీ లేదని... 2014 ఎన్నికల్లో ఆ హామీలన్నింటినీ తాము ఇచ్చి, అమలు చేశామని చెప్పారు. గత ఎన్నికల్లో నెరవేర్చలేని హామీలను చంద్రబాబు ఇచ్చారంటూ విమర్శించిన జగన్... ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం అవే హామీలను ఇచ్చారని విమర్శించారు.