: ఏపీలో నన్ను హత్య చేస్తారేమో?: మంద కృష్ణ
తనకు ఆంధ్రప్రదేశ్ లో రక్షణ లేకుండా పోయిందని, తనను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారన్న అనుమానాలు వస్తున్నాయని, తాను ఎక్కడికి వెళ్లినా కొన్ని కార్లు వెంబడిస్తున్నాయని ఎంఆర్పీఎస్ నాయకుడు మంద కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉదయం వరంగల్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, పది రాష్ట్రాల్లో ఎంఆర్పీఎస్ పని చేస్తోందని, మిగతా రాష్ట్రాల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న తనను, ఏపీలో చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
తనకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించనున్నానని అన్నారు. తనను వెంబడిస్తున్న వారి వివరాలు తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా తెలుసునని, తెలంగాణ సర్కారుకు తెలీకుండా తనను వెంబడించలేరని వ్యాఖ్యానించిన ఆయన, నిందితులెవరో 24 గంటల్లో తేల్చాలని డిమాండ్ చేశారు. తాను రెండు రాష్ట్రాల సీఎంలతో కలసి పని చేశానని, వర్గీకరణ విషయంలో ఇద్దరు చంద్రులూ మాట తప్పారని విమర్శించారు. చంద్రబాబు తన విధానాన్ని మార్చుకోవాలని, 100 మంది బాబులు వచ్చినా తాము ఎదుర్కొంటామని హెచ్చరించారు.