: నారా లోకేశ్ అంటున్నట్లు ఆ పరిస్థితి లేదు: ఎమ్మెల్యే రోజా
తాము తదుపరి ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. గత ఎన్నికల సమయంలోనే జగన్ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తోరో చెప్పారని అన్నారు. అయితే, ఎన్నో హామీలు గుప్పించి టీడీపీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. హామీలను నెరవేర్చని టీడీపీ పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. జగన్ మాత్రం చెప్పిందే చేస్తారని అన్నారు.
గుంటూరులో నిర్వహిస్తోన్న వైసీపీ ప్లీనరీ మొదటిరోజు ముగిసిన తరువాత రోజా మీడియాతో మాట్లాడుతూ... మంత్రి నారా లోకేశ్ ఏపీలో ప్రతిపక్షపార్టీనే లేదని అన్నారని రోజా అన్నారు. తాము నియోజక వర్గ స్థాయి, జిల్లా స్థాయిలో నిర్వహించిన ప్లీనరీలు చూసే టీడీపీ నేతలు భయపడిపోయారని, ఇక ఇలాంటి రాష్ట్రస్థాయి ప్లీనరీలో తమ పార్టీకి వస్తోన్న స్పందన చూసి వణికిపోతున్నారని రోజా చెప్పారు. తమకు రాష్ట్రంలో ఇంతగా ఆదరణ ఉంటే లోకేశ్ తో పాటు రాష్ట్రమంత్రులు ప్రతిపక్ష పార్టీ ఉనికేలేదని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.