: ఎవరూ గుర్తుపట్టకుండా బుర్ఖా వేసుకుని కోర్టుకు వచ్చిన రాఖీ సావంత్
బాలీవుడ్ సింగర్ మీకా సింగ్ ను వాల్మీకి మహర్షితో పోల్చి వివాదం రేపిన బాలీవుడ్ ఐటెం గర్ల్ రాఖీ సావంత్ పంజాబ్ లోని లూధియానా కోర్టుకు హాజరైంది. ఈ కేసులో విచారణకు హాజరుకాకుండా ఉన్న రాఖీకి లుధియానా న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్ అందజేసేందుకు న్యాయస్థానం సిబ్బంది ముంబైలోని ఆమె నివాసానికి వెళ్లినా, ఆమె దొరకలేదు.
దీంతో జూలై 7 లోపు ఆమె కోర్టులో లొంగిపోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఈ కేసు విచారణ శుక్రవారం జరగాల్సి ఉండగా, ఒక రోజు ముందుగా గురువారమే ఆమె కోర్టులో లొంగిపోయింది. ఈ సందర్భంగా తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు, బుర్ఖా ధరించి ఆమె కోర్టుకు వచ్చింది. అనంతరం న్యాయస్థానం ఆదేశం మేరకు 2 లక్షల రూపాయలు బాండ్ లు చెల్లించి బెయిల్ పొంది, ముంబై చేరిందని ఆలస్యంగా వెలుగు చూసింది.