: ఆ సంఘటనపై క్షమాపణలు చెబుతున్నా: ఆనంద్ మహీంద్రా
మహీంద్రా గ్రూప్ కు చెందిన కంపెనీ నుంచి ఓ ఉద్యోగిని ఇటీవల అర్థాంతరంగా తొలగించారు. తొలగింపునకు గురైన ఉద్యోగితో హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ వారు చాలా దురుసుగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన సంభాషణలు రికార్డు కావడం, అవి బయటకు రావడమే కాకుండా, సామాజిక మాధ్యమాలకు చేరాయి. ఈ క్రమంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, టెక్ మహీంద్రా సీఈఓ గుర్నామి స్పందించారు.
ఈ సంఘటనపై తాను వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నానని, ప్రతి ఒక్కరి గౌరవాన్ని, విలువను కాపాడటమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కావని భరోసా ఇస్తున్నానని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్ లో పేర్కొన్నారు. సదరు ఉద్యోగితో హెచ్ ఆర్ ప్రతినిధి మాట్లాడిన తీరుపై తాను తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నానని, ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు సరైన చర్యలు తీసుకుంటామని గుర్నాని తన ట్వీట్ లో హామీ ఇచ్చారు.