: సరిహద్దులో ఉద్రిక్తత... సమావేశంలో ప్రశంస: భారత్ కు చైనా అధినేత పొగడ్తలు!
ఓవైపు సిక్కిం సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు దేశాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే, వీటన్నింటికీ విరుద్ధంగా, ఊహించని విధంగా భారత్ ను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రశంసల్లో ముంచెత్తారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటం, ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భారత్ చేస్తున్న కృషి చాలా గొప్పదని జిన్ పింగ్ ప్రశంసించారు. బ్రిక్స్ దేశాల సమాఖ్యలో కూడా భారత్ పాత్ర చాలా గొప్పదని కొనియాడారు. ఆర్థిక, సామాజిక రంగాల్లో భారత్ సాధిస్తున్న పురోభివృద్ధి అభినందనీయమని అన్నారు. రానున్న రోజుల్లో భారత్ మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు.
జీ-20 దేశాల సదస్సులో పాల్గొనడానికి మోదీ, జిన్ పింగ్ లు జర్మనీలోని హాంబర్గ్ కు వెళ్లారు. ఇదే సమయంలో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాల అధినేతలు ఓ ఇన్ఫార్మల్ మీటింగ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ, జిన్ పింగ్ లు షేక్ హ్యాండ్ లు ఇచ్చుకుని, ఆప్యాయంగా పలకరించుకున్నారు. సమావేశంలో ఇద్దరూ పక్కపక్కనే ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా జిన్ పింగ్ మాట్లాడుతూ, పైవిధంగా స్పందించారు. అంతకు ముందు మోదీ మాట్లాడుతూ, జిన్ పింగ్ ఛైర్మన్ షిప్ లో బ్రిక్స్ నిర్దేశిత లక్ష్యాలను సాధించే దిశగా కొనసాగుతోందని కితాబిచ్చారు. అయితే వీరిద్దరి మధ్య ప్రత్యేక సమావేశం మాత్రం జరగలేదు.