: సీనియర్ అధికారిపై చేపను విసిరిన ఎమ్మెల్యే!
మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలోని కంకావ్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే నితీశ్ రాణే ఓ ప్రభుత్వ సీనియర్ ఉద్యోగిపై చేపను విసిరిన ఘటన చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, కొంకణ్ ప్రాంతంలోని మత్స్యకారులతో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మత్స్యశాఖకు చెందిన పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చచ్చి పడి ఉన్న ఓ చేపను అధికారిపైకి విసిరారు. దీంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు.
ఈ ఘటనపై రాణేను మీడియా ప్రశ్నించగా... మత్స్యకారుల సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని... ఆ కోపంతోనే ఈ పని చేశానని సమాధానమిచ్చారు. ఆధునిక పద్ధతుల్లో చేపలు పట్టే మత్స్యకారుల వల్ల సాధారణ మత్స్యకారులు నష్టపోతున్నారని... వీరు దోపిడీకీ గురవుతున్నారని చెప్పారు. వీరిని చూసి సరిహద్దుల్లో ఉన్న మత్స్యకారులు కూడా అక్రమంగా చేపలను పట్టుకుని వెళ్లిపోతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక పేద మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. తమ సమస్యల గురించి అధికారులకు మత్స్యకారులు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి బుద్ధి చెప్పాలనే కారణంతోనే తాను చేపను విసిరానని వివరణ ఇచ్చారు.