: అత్యాచారం జరగలేదు... బ్యూటిషియన్ శిరీష ఆత్మహత్యపై ఫోరెన్సిక్ నివేదిక!
హైదరాబాదు ఫిల్మ్ నగర్ లోని ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీష కేసు తెలుగు రాష్ట్రాల్లో పెనుకలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటన్నింటికీ సమాధానం ఫోరెన్సిక్ రిపోర్ట్ తో వస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతా ఆసక్తిగా ఎదురు చూసిన శిరీష హత్య కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేసింది.
ఇందులో శిరీషపై అత్యాచారం జరగలేదని నిపుణులు తేల్చిచెప్పారు. ఆమెది హత్య కాదని ఆత్మహత్య అని వారు స్పష్టం చేశారు. అత్యాచారానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని వారు తెలిపారు. శిరీష కుటుంబ సభ్యులకు ఫోరెన్సిక్ రిపోర్ట్ చూపిస్తామని వారు తెలిపారు. వారు కోరుకుంటే వైద్యులతో కూడా మాట్లాడిస్తామని చెబుతున్నారు.