: జయంతికి, వర్ధంతికి తేడా తెలియని నువ్వూ ఓ మంత్రివేనా?: లోకేష్ పై ఆళ్ల విసుర్లు
సదావర్తి భూములను తాను కొనుగోలు చేస్తే, ఐటీ దాడులు చేయిస్తానని ఏపీ మంత్రి లోకేష్ వ్యాఖ్యానించడంపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలియని నువ్వూ ఓ మంత్రివా? అంటూ విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, ధైర్యముంటే తన ఆస్తులతో పాటు లోకేష్ ఆస్తులపైనా సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు.
డబ్బిచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించిన కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లే వరకూ నిద్రించేది లేదని స్పష్టం చేశారు. తనపై ఐటీ దాడులకు ఆదేశించడానికి లోకేష్ ఎవరని ప్రశ్నించిన ఆయన, చంద్రబాబు కుటుంబం చేసేదే వ్యాపారమని అనుకుంటున్నారని, 600 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గద్దెదిగే సమయం దగ్గర్లోనే ఉందని ఆర్కే హెచ్చరించారు.