: ధర తగ్గే కాలం... బ్రియో, అమేజ్, జాజ్, సిటీల ధరలను తగ్గించిన హోండా!
వస్తు, సేవల పన్ను అమల్లోకి వచ్చి, పన్నుల భారం తగ్గడంతో పలు వాహన కంపెనీలు తమ తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తుండగా, అదే దారిలో హోండా కూడా పయనించింది. తమ అన్ని కార్లపై రూ. 1.31 లక్షల వరకూ ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. హోండా సిటీ మోడల్ లో ఎంచుకునే వేరియంట్ ను బట్టి రూ. 16,510 నుంచి రూ. 28,005 వరకూ ధరను తగ్గిస్తున్నట్టు తెలిపింది.
చౌక కారు బ్రియోలో రూ. 7,890 నుంచి రూ. 12,279 వరకూ, జాజ్ వేరియంట్ లో రూ. 6,168 నుంచి రూ. 10,031 వరకూ, అమేజ్ వేరియంట్ లో రూ. 9,203 నుంచి రూ. 14,285 వరకూ ధరలను తగ్గిస్తున్నట్టు పేర్కొంది. ఇక సీఆర్-వీ ధర ఎంచుకునే వేరియంట్ ను బట్టి రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.31 లక్షల వరకూ ధర తగ్గుతుందని తెలిపింది. తగ్గించిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని వెల్లడించింది. హోండా సిటీ వేరియంట్ ధర రూ. 28 వేల వరకూ తగ్గిందని తెలిపింది. హై ఎండ్ మోడల్ లో తాము విక్రయిస్తున్న హోండా అకార్డ్ హైబ్రిడ్ (ప్రస్తుతం రూ. 37.22 లక్షలు - ఎక్స్ షోరూం, న్యూఢిల్లీ) మారిన ధరను త్వరలోనే ప్రకటిస్తామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.